Saturday, 4 July 2020

పింగళి వెంకయ్య

నేడు మన త్రివర్ణ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య వర్ధంతి



     పింగళి వెంకయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపాన ఉన్న ప్రస్తుత మొవ్వ మండలములోని భట్లపెనుమర్రు గ్రామములో హనుమంతరాయుడు, వెంకటరత్నమ్మ దంపతులకు 1876 ఆగస్టు 2న జన్మించారు.  ఆయన చిన్నప్పటి నుండే చాలా చురుకైన విద్యార్థి. ప్రాథమిక విద్య చల్లపల్లి లోను, మచిలీపట్నంలోని హిందూ ఉన్నత పాఠశాలలోనూ అభ్యసించారు. మద్రాసులో ఫ్లేగు ఇనస్పెక్టరు శిక్షణ పూర్తి చేసి, కొంతకాలం బళ్లారిలో ప్లేగ్ ఇనస్పెక్టరుగా పనిచేసారు. అతని జ్ఞాన దాహం అంతులేనిది. శ్రీలంక వెళ్ళి కొలంబోలోని సిటీ కాలేజీలో పొలిటికల్ ఎకనమిక్స్ ప్రత్యేక విషయంగా చదివి కేంబ్రిడ్జ్ సీనియర్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. కొంతకాలం రైల్వేలో గార్డుగా పనిచేసాడు. ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి లాహోర్ లోని డి.ఎ.వి. (ఆంగ్లో - వేదిక్) కాలేజీలో చేరి, సంస్కృతం, ఉర్దూ, జపాన్ భాషల్లో మంచి పాండిత్యం సంపాదించాడు. జపాన్ భాషలో అనర్గళంగా మాట్లాడే వెంకయ్య గారిని "జపాన్ వెంకయ్య" అని పిలిచేవారు.

     1906 నుండి 1922 వరకు జాతీయోద్యమాలతో పాటు మునగాల పరగణా నడిగూడెంలో జమీందారు రాజా బహదూర్ నాయని రంగారావు కోరిక మేరకు నడిగూడెంలో నివాసము౦డి పత్తి మొక్కలలోని మేలురకముల పరిశోధనలో వినియోగించాడు. నడిగూడెంలో వ్యవసాయ క్షేత్రాన్ని నిర్మించాడు. ఈ పరిశోధనలలో కంబోడియా పత్తి అను ఒక ప్రత్యేక రకమైన పత్తి మీద విశేష కృషి చేశాడు. ఈయన కృషిని ఆనాటి బ్రిటీషు ప్రభుత్వముకూడా గుర్తించడముతో ఈయనకు పత్తి వెంకయ్య అని పేరు వచ్చింది.

     వెంకయ్య బందరు లోని జాతీయ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశాడు. వ్యవసాయ శాస్త్రం, చరిత్రలతో పాటు విద్యార్థులకు గుర్రపుస్వారీ, వ్యాయామం, సైనిక శిక్షణ ఇచ్చేవాడు. అప్పట్లో చైనా జాతీయ నాయకుడైన 'సన్ యత్ సేన్' జీవిత చరిత్ర వ్రాశాడు. మద్రాసు వెళ్ళి ప్రెసిడెన్సీ కాలేజీలో భూగర్భ శాస్త్రంలో పరిశోధనలు చేసి 'డిప్లొమా' తీసుకొన్నాడు. తరువాత నెల్లూరు చేరి 1924 నుండి 1944 వరకు అక్కడే ఉంటూ మైకా (అభ్రకం) గురించి పరిశోధన చేశాడు. వజ్రకరూరు, హంపి లలో ఖనిజాలు, వజ్రాలు గురించి విశేషంగా పరిశోధనలు జరిపి ప్రపంచానికి తెలియని వజ్రపు తల్లిరాయి అనే గ్రంథం రాసి 1955లో దాన్ని ప్రచురించాడు. దేశానికి స్వాతంత్ర్యం లభించిన తరువాత ప్రభుత్వం వెంకయ్యను ఖనిజ పరిశోధకశాఖ సలహాదారుగా నియమించింది. ఆ పదవిలో ఆయన 1960 వరకు పనిచేసాడు. అప్పటికి ఆయన వయస్సు 82 సంవత్సరాలు.


     19 ఏళ్ల చిన్న వయసులోనే దేశభక్తితో జాతీయోద్యమంవైపు ఆకర్షితులైన వెంకయ్య గారు. సైన్యంలో చేరి బోయర్ యుద్ధంలో పాల్గొనటానికి ఆఫ్రికా వెళ్లారు. అక్కడ గాంధీజీ ఉద్యమాలతో స్ఫూర్తిపొందారు. భారతదేశం తిరిగివచ్చాక స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. ఆ క్రమంలో భారత జాతీయ పతాకం రూపకల్పన మీద ఆసక్తి కలిగింది. ఆయన 1916లో తన ఆలోచనలతో ‘ఎ నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా’ అనే పుస్తకం రాశారు. అందులో 24 రకాల జెండా నమూనాలను ప్రతిపాదించారు.

     1916లో లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో వెంకయ్య తయారు చేసిన జాతీయ జెండానే ఎగురవేశారు. 1919లో జలంధర్ వాస్తవ్యులైన లాలా హన్స్ రాజ్ మన జాతీయ పతాకంపై రాట్న చిహ్నముంటే బాగుంటుందని సూచించగా గాంధీజీ దాన్ని అంగీకరించాడు. 1921లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలు బెజవాడలో జరిగాయి. గాంధీజీ వెంకయ్యను ఆ సమావేశానికి పిలిపించి కాషాయం, ఆకుపచ్చ రంగులు కలిగి, మధ్య రాట్నంగల ఒక జెండాను చిత్రించమని కోరాడు. మహాత్ముడు సూచించిన ప్రకారంగానే, ఒక జెండాను సమకూర్చాడు వెంకయ్య. అనంతరం వచ్చిన ఆలోచనల మేరకు, సత్యం, అహింసలకు ప్రత్యక్ష నిదర్శనమైన తెలుపు రంగు కూడా ఉండాలని గాంధీజీ అభిప్రాయపడగా, వెంకయ్య ఆ జెండాలో అదనంగా తెలుపు రంగును చేర్చి నేటి త్రివర్ణ పతాకాన్ని దేశానికి ప్రసాదించాడు. కాషాయ రంగు హిందువులకు చిహ్నమని, ఆకుపచ్చ ముస్లింలకని పేర్కొనడంతో, ఇతర మతాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలనే అభిప్రాయం వెలువడడంతో గాంధీజీ సూచనపై ఆకుపచ్చ, కాషాయ రంగులుతో పాటు తెలుపు కూడా చేర్చి త్రివర్ణ పతాకాన్ని వెంకయ్య రూపొందించాడు. మధ్యనున్న రాట్నం గ్రామ జీవనాన్ని, రైతు కార్మికత్వాన్ని స్ఫురింప చేస్తుందన్నారు. కార్మిక కర్షకులపై ఆధారపడిన భారతదేశం, సత్యాహింసలను ఆచరించడంతో సుభిక్షంగా ఉంటుందని మన ఆశయం. ఆ ఆశయ చిహ్నమే మన త్రివర్ణ పతాకం.

     1947, జూలై 22 వ తేదీన భారత రాజ్యాంగ సభలో నెహ్రూ జాతీయ జెండా గురించి ఒక తీర్మానం చేస్తూ, మునుపటి త్రివర్ణ జెండాలోని రాట్నాన్ని తీసేసి, దాని స్థానంలో అశోకుని ధర్మచక్రాన్ని చిహ్నంగా ఇమిడ్చారు. చిహ్నం మార్పు తప్పితే పింగళి వెంకయ్య రూపొందించిన జెండాకు నేటి జెండాకు తేడా ఏమీ లేదు. అశోకుని ధర్మచక్రం మన పూర్వ సంస్కృతికి సంకేతం. ఇందులోని రంగులకు మతపరమైన ప్రాతినిధ్యాలేవీ లేవని ప్రకటించారు. సాహసం, త్యాగాలకు కాషాయవర్ణం, శాంతి సత్యాలకు శ్వేతవర్ణం, నిజాయితీ, దయాగుణాలకు ఆకుపచ్చరంగు చిహ్నాలుగా అభివర్ణించారు.

No comments:

Post a Comment